ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 24 August 2026, 7:23 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

అంజయ్యనగర్ భవన కూల్చివేత కేసులో బిల్డర్ అరెస్ట్ దేశం విడిచి పారిపోయేందుకు యత్నిస్తుండగా షంషాబాద్‌లో పట్టుకున్న పోలీసులు

అర్జున్ సమాచారం:
గచ్చిబౌలి అంజయ్యనగర్‌లో నిర్మాణంలో ఉన్న G+7 అంతస్తుల భవనం కూలిన ఘటనలో పోలీసులు కీలక చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి బిల్డర్ సయ్యద్ సాజిద్ (39)ను రాత్రి రాయదుర్గం పోలీసులు షంషాబాద్‌లో అరెస్ట్ చేశారు. దేశం విడిచి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.
ఆగస్టు 22న మధ్యాహ్నం సుమారు 1 గంట సమయంలో అంజయ్యనగర్‌లోని ప్లాట్ నంబర్ 113/131/1, సర్వే నంబర్ 135లో నిర్మాణంలో ఉన్న G+6 భవనం ఒక్కసారిగా కుప్పకూలిన సంగతి తెలిసిందే. శిథిలాల కింద చిక్కుకుని మధ్యప్రదేశ్‌కు చెందిన టైల్స్ కార్మికులు ఉమేష్ ఖరే (45), మోహ్‌పాల్ భలావి (46) మృతి చెందారు.భవనం కూలడంతో పక్కనే ఉన్న జయదర్శిని రెసిడెన్సీ సి-బ్లాక్ కూడా దెబ్బతింది. ఈ ఘటనలో 75 ఏళ్ల కె.వి. రమణారెడ్డితో పాటు మరికొందరికి గాయాలయ్యాయి.
అనుమతులు లేకుండానే నిర్మాణం?ఘటనపై జయదర్శిని రెసిడెన్సీకి చెందిన తక్కల వెంకట్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 945/2026, BNS సెక్షన్ 105, 3(5) కింద కేసు నమోదు చేశారు.పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. భవన నిర్మాణానికి సంబంధించి మున్సిపల్ అధికారుల నుంచి అవసరమైన అనుమతులు తీసుకోలేదని, తప్పనిసరి సెట్‌బ్యాక్ నిబంధనలు పాటించలేదని, పక్కనే ఉన్న నాలాను ఆక్రమిస్తూ నిర్మాణం చేపట్టారని, నాసిరకం నిర్మాణ సామగ్రిని ఉపయోగించినట్లు దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు.
భవన నిర్మాణాన్ని బిల్డర్ సయ్యద్ సజీద్ అలియాస్ సయ్యద్ సాజిద్ చేపట్టగా, కాంట్రాక్టర్‌గా ఖాజా మొయినుద్దీన్ అలియాస్ మహమ్మద్ ఖాజా మియా వ్యవహరించినట్లు పోలీసులు పేర్కొన్నారు.కాంట్రాక్టర్ పరారీ
ప్రధాన నిందితుడైన బిల్డర్‌ను పోలీసులు అరెస్ట్ చేయగా, సహ నిందితుడు, కాంట్రాక్టర్ ఖాజా మొయినుద్దీన్ పరారీలో ఉన్నాడు. అతడిని పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేష్ రెడ్డి, కూకట్‌పల్లి జోన్ డీసీపీ రితిరాజ్,  ఆదేశాల మేరకు, మాదాపూర్ ఏసీపీ  శ్రీధర్ పర్యవేక్షణలో రాయదుర్గం ఇన్‌స్పెక్టర్ టి. భూపతి దర్యాప్తు చేపట్టారు.
మృతదేహాలకు ఉస్మానియా జనరల్ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి, అనంతరం వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఘటనపై దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది.
అయితే ఈ కేసులో కీలక ప్రశ్నలు ఇంకా మిగిలే ఉన్నాయి. భవన నిర్మాణానికి అనుమతులు లేకపోతే ఇంత భారీ నిర్మాణం ఎలా కొనసాగింది? సెట్‌బ్యాక్‌లు, నాలా ఆక్రమణ, నిర్మాణ నాణ్యతపై సంబంధిత అధికారులు ముందుగానే ఎందుకు చర్యలు తీసుకోలేదు?అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
=====================